అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలు తుది ఘట్టానికి చేరుతున్నాయి. రేపటితో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ముగియనున్నాయి. ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే విశాఖపట్టణం, తూర్పు గోదావరి ఏజెన్సీ గ్రామాల్లో మాత్రం మధ్యాహ్నం 1.30 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరపనున్నారు.
13 జిల్లాల్లోని 20 డివిజన్లు 160 మండలాల్లో 2,640 పంచాయితీలకు రేపు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలయ్యాక సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అయితే మూడో విడతలో మొత్తం పంచాయతీలు 3,221 ఉండగా వాటిలో 579 ఏకగ్రీవం అయ్యాయి. రేపు ఎన్నికలు జరిగే పంచాయతీలు 2,640 ఉన్నాయి. అయితే మూడు పంచాయితీల్లో నామినేషన్లు నమోదు కాలేదు.
ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్‌ఈసీ, డీజీపీ కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎన్నికలపై నిరంతరం పర్యవేక్షణ పెట్టనున్నారు. ఎస్ఈసీ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్, కౌంటింగ్ ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది.