అమరావతి: ఏపీలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్, అగ్రవర్ణ పేదలకు) విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇప్పటికే రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విద్యావకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ రిజర్వేషన్లను ఉద్యోగాలకు కూడా వర్తింపజేస్తూ 10% రిజర్వేషన్లను కల్పిస్తూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై విధి విధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ వర్గాలలోకి రాని వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. వీరికి కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా రూ.8 లక్షల దాటకూడదు.
ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోస్టర్ పాయింట్లను తర్వాత ప్రత్యేకంగా నిర్ణయించి ప్రకటిస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కల్పించే పది శాతం రిజర్వేషన్లలో మూడో వంతు ఆ వర్గాలకు చెందిన మహిళలకు కేటాయిస్తారు. అర్హులైన వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించారు.