బడ్జెట్: ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం వచ్చే ఆదాయం, చేయనున్న వ్యయాన్ని అసెంబ్లీలో ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఈసారి ఏపీలో ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం ఏప్రిల్ నుండి జూలై వరకు నాలుగు నెలల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. జూన్‌లో వచ్చిన కూటమి ప్రభుత్వం మిగిలిన 8 నెలలకు బడ్జెట్‌ను ఆమోదించాల్సి ఉంది.
అయితే, జూలై అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సమావేశాలుగా పిలిచినా, కేవలం శ్వేత పత్రాలనే ప్రవేశపెట్టడం, బడ్జెట్ పై చర్చను వాయిదా వేయడం జరిగింది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదని పేర్కొన్న సీఎం చంద్రబాబు, అక్టోబరులో ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. కానీ అక్టోబర్ కూడా ముగిసిపోయింది, బడ్జెట్ అంశంపై ఎటువంటి ప్రకటన లేదు.
జూలై నుండి బడ్జెట్‌ను ఆర్డినెన్స్‌ల ద్వారా పొడిగిస్తూ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను సమతూకంలో ఉంచే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు నాలుగు నెలల పాటు మాత్రమే పొడిగించిన ఆర్డినెన్స్‌ను మరింత పొడిగించి, వచ్చే ఏడాది మాత్రమే పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
సంపద సృష్టి, ఆర్థిక సంస్కరణలపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. గత ఎన్నికల హామీలను అమలు చేసేందుకు పెద్ద ఎత్తున నిధుల అవసరం ఉన్నందున, బడ్జెట్ ప్రవేశం ఇంకా ఆలస్యం కావచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది.