ఆంధ్రప్రదేశ్: ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువతకు ఐటీ, డిజిటల్ రంగాల్లో నైపుణ్యాలను అందించేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ సమక్షంలో సిస్కో సంస్థ, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మధ్య ఒప్పందం కుదిరింది.
ఉండవల్లి నివాసంలో జరిగిన ఈ ఎంఓయు కార్యక్రమంలో ఇరుపక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిగ్రీ, ఇంజినీరింగ్, వృత్తి విద్యార్థులకు నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ వంటి రంగాల్లో సిస్కో శిక్షణ అందించనుంది.
50 వేల మందికి పైగా విద్యార్థులు, ఉద్యోగులకు ఇది లబ్ధి చేకూరుస్తుందని అధికారులు తెలిపారు. వర్చువల్ ఇంటర్న్‌షిప్, స్వీయ అభ్యసన కోర్సులు, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఈ ప్రోగ్రామ్‌లో భాగం.
NetAcad అనే సిస్కో పోర్టల్ ద్వారా విద్యార్థులు సెల్ఫ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్పెషల్ కోర్సులు డిజైన్ చేయనున్నారు.
ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన వారికి సిస్కో తరఫున అధికారిక సర్టిఫికెట్ జారీ చేయనున్నారు. మహిళలకు ‘వుమెన్ రాక్ ఐటీ’, యువతకు ‘ఎఫ్‌వైఐఎఫ్’ వంటి ప్రత్యేక సపోర్ట్ ప్రోగ్రామ్‌లు కూడా అందుబాటులో ఉండనున్నాయి.