న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన భేటీ ఫలప్రదంగా జరిగిందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని తెలిపారని ఆయన ట్వీట్ చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి తన సహాయ సహకారాల పట్ల ట్విటర్ వేదికగా ప్రధాని మోదీకి విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం దాదాపు 50 నిమిషాల పాటు సుదీర్ఘంగా జరిగింది.
రాష్ట్ర అభివృద్ధి అజెండాగా జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి కేంద్రం అందించాల్సిన సహాయం, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర విభజన హామీలు, తదితర 17 అంశాలపై ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రి నివేదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. భేటీ అనంతరం కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు.