తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదలతో తడిసిముద్దయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కృష్ణా నదికి భారీగా వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, సహాయక చర్యలపై బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
మంత్రులు సుచరిత, బొత్స, సీఎస్ నీలంసాహ్ని కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్లు,అధికారులతో జిల్లాలవారీగా సీఎం సమీక్షించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.
సీఎం సూచించిన పలు ముఖ్య సూచనలు:
- కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి.
- విద్యుత్ సరఫరా పునరుద్ధరణ వేగంగా జరగలన్నారు.
- కాలువలు, చెరువుల గండ్లు పూడ్చడంతో పాటు, రహదారుల మరమ్మతు పనులు యుద్ధప్రాతిపదికన జరగాలి.
- వేర్వేరు జిల్లాలలో చనిపోయిన 10 మంది కుటుంబాలకు వెంటనే పరిహారం చెల్లించండి.
- తూర్పు గోదావరి జిల్లాలో ఏలేరు రిజర్వాయర్ వల్ల పిఠాపురంలో వరద వస్తోంది కాబట్టి, అవసరమైన ఆధునీకరణ చేపట్టండి.
- విజయవాడలో ఇళ్లు ఖాళీ చేయించే వారికి తప్పనిసరిగా వసతి కల్పించాలి. వారందరికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.
- ప్రకాశం బ్యారేజీకి ఇంకా వరద వస్తోంది కాబట్టి, పూర్తి అప్రమత్తంగా ఉండండి. బ్యారేజీ వద్ద 7.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే వీలుంది.
- రాయలసీమతో పాటు, శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు రిజర్వాయర్లు నింపడం, అక్కడనుంచి కాలువల ద్వారా ప్రతి చెరువులు నింపడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
- కలుషిత నీరు లేకుండా మంచి తాగునీరు సరఫరా చేయాలి. ఎక్కడా వ్యాధుల ప్రబలకుండా తగిన జాగ్రత్తులు తీసుకోవాలి. ముఖ్యంగా డయేరియా వంటివి పూర్తిగా నివారించాలి.
- ఆ మేరకు అన్ని పీహెచ్‌సీలలో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి. క్లోరినేషన్ కూడా చేయాలి.