అమరావతి: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రోజు లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆస్పత్రుల కోసం కేటాయించిన కోవిడ్ వ్యాక్సిన్లు పూర్తిగా వినియోగించబడలేదని, అలాంటి వ్యాక్సిన్లను ప్రభుత్వం జరిపే వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కేటాయించాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు.
కేంద్రం వ్యాక్సిన్ పాలసీ ప్రకారం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో 25 శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆస్పత్రులకు కేటాయించారని, ఈ వాటాలో చాలా వరకు వ్యాక్సిన్లు మిగిలిపోయాయని సీఎం పేర్కొన్నారు. జులై నెలలో ప్రైవేట్ ఆస్పత్రులకు 17,71,580 డోసులు కేటాయించారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆస్పత్రులు పూర్తిగా వినియోగించుకునే అవకాశం లేదన్నారు.
అలా ప్రైవేట్ ఆస్పత్రులు తీసుకోని కోవిడ్ వ్యాక్సిన్ నిల్వలను రాష్ట్ర ప్రభుత్వ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌కు కేటాయించాలని ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 24న జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశంలోనూ, ఇతర రాష్ట్రాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయని తన లేఖలో సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు.