ఆంధ్రప్రదేశ్: ఏపీ సీఎం తమ్ముడు కన్నుమూత
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
ఈ మధ్యకాలం నుంచి ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని ఆసుపత్రి వర్గాలు ధృవీకరించాయి.
విషయం తెలుసుకున్న మంత్రి నారా లోకేశ్ తన అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు.
రామ్మూర్తి నాయుడి జీవిత విశేషాలు:
1952లో నారా కర్జూరనాయుడు, అమ్మన్నమ దంపతులకు జన్మించిన రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు నాయుడికి సోదరుడు.
1994లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రామ్మూర్తి నాయుడు 1999 వరకు ప్రజలకు సేవలందించారు.
అనారోగ్యం కారణంగా రాజకీయాల నుంచి విరమించుకున్నారు. రామ్మూర్తి నాయుడికి ఇద్దరు కుమారులు—నటుడు నారా రోహిత్, నారా గిరీష్.
సోదరుడి మరణంపై చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “నా తమ్ముడు, చంద్రగిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మనల్ని విడిచి వెళ్లిపోయాడని బాధాతప్త హృదయంతో అందరికి తెలియచేస్తున్నాను. రామ్మూర్తి నాయుడు ప్రజా జీవితంలో పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవలు అందించిన నాయకుడు. మా నుంచి దూరమైన మా సోదరుడు మా కుటుంబంలో ఎంతో విషాదాన్ని నింపాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.” అని చంద్రబాబు ఆవేదనతో పేర్కొన్నారు.