అమరావతి : ఏపీలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పచ్చ జెండా ఊపారు. రాష్ట్రంలోని ఉన్నత విద్య విధానంపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఉన్నత విద్యలో నమోదును 90 శాతానికి పెంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, సంబంధిత శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర తదితరులు హాజరయ్యారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనల ద్వారా ఉన్నత విద్యకు అండగా నిలుస్తున్నామని సీఎం జగన్ అన్నారు. దీని వల్ల కచ్చితంగా గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో పెరగాలన్నారు. పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకు రావాలని, డిగ్రీ కోర్సులో అప్రెంటిస్ షిప్ చేర్చినట్లు తెలిపారు. మూడేళ్ల డిగ్రీ కోర్సులో 10 నెలల అప్రెంటిస్‌షిప్‌ను అమలు పరుస్తున్నామని పేర్కొన్నారు.
దీనికి అదనంగా ఒక ఏడాది నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అంశాలపై శిక్షణ కూడా ఉంటుందని, ఆ తర్వాతే దాన్ని డిగ్రీ ఆనర్స్‌గా పరిగణిస్తామన్నారు. వృత్తి విద్యా డిగ్రీలకు సంబంధించి 4 ఏళ్లలో కూడా 10 నెలలు తప్పనిసరి అప్రెంటిస్‌షిప్ ఉంటుందన్నారు. దీనికి అదనంగా 20 అడిషనల్ క్రెడిట్స్ సాధించేవారికి కూడా ఆనర్స్ డిగ్రీ ఇవ్వాలని ఆదేశించారు. అడ్మిషన్లు పొందినప్పుడే సాధారణ డిగ్రీ కావాలా? లేదా ఆనర్స్ డిగ్రీ కావాలా? అన్న దానిపై ఐఛ్చికాన్ని తీసుకుంటామని వెల్లడించారు.