అమరావతి : దేశంలో ఇంకా కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గలేదు. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కేసులు అధికంగానే నమోదవుతున్నాయి. కాగా ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో తిరిగి నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ రాష్త్ర ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాష్ట్రంలో ఈ కర్ఫ్యూ కొనసాగనుంది.
రాష్ట్రంలో తాజాగా ఈ నైట్ కర్ఫ్యూ ఆగస్టు 14 వరకు కొనసాగనుంది. రాష్ట్రంలో ఎవరైనా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు వారిపి కఠిన చర్యలు తీసుకోవాలన ప్రభుత్వం సూచించింది. ఇదిలా ఉండగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా వీలైనంత త్వరగా రాష్ట్రంలో ఉపాధ్యాయులకు టీకా వేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఆగష్టు నెలలో రాష్ట్రంలో పాఠశాలలను తిరిగి ప్రారంభించనున్న సందర్భంలో టీచర్లకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మే, జూన్, జూలై నెలల్లో ప్రైవేటు ఆస్పత్రులకు 43,38,000 డోసులు ఇస్తే, కేవలం 5,24,347 మాత్రమే వినియోగించారని అందుకోసం ఈ వినియోగించని వ్యాక్సిన్లను ప్రభుత్వానికి అందజేస్తే రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇంకా వేగంగా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు.