ఏపీ: ఫైబర్ నెట్ సంస్థలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన వ్యూహం సినిమాకు ఏపీ ఫైబర్ నెట్ నుంచి రూ. 2.15 కోట్లు చెల్లించారని వెల్లడించారు.
ఈ చెల్లింపులు వ్యూస్ ప్రకారం జరిగాయని, కానీ, కేవలం 1,863 వ్యూస్ మాత్రమే రావడం గమనార్హమని తెలిపారు. అంటే ఒక్కో వ్యూవ్‌కు రూ. 11,000 చెల్లించినట్లు ఉందని జీవీ రెడ్డి వివరించారు.
ఈ సినిమా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై సెటైర్ వేయడమే లక్ష్యంగా రూపొందించారని, వైసీపీ నేతలు ఈ ప్రాజెక్టుకు ఫండింగ్ చేశారనే ఆరోపణలు అప్పట్లో వచ్చినట్లు గుర్తు చేశారు.
ఆ సమయంలో అంబటి, రోజా వంటి వైసీపీ నేతలు ఈవెంట్లలో పాల్గొనడం చర్చనీయాంశమైంది.
ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అవకతవకల వల్ల కనెక్షన్లు పది లక్షల నుంచి ఐదు లక్షలకు పడిపోయాయని ఆరోపించిన జీవీ రెడ్డి, అక్రమ నియామకాలను రద్దు చేస్తూ, పారదర్శకతతో ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.