- కోవిడ్ నివారణ చర్యలపై ఎపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష
- 17 వేల మంది డాక్టర్లు, 12 వేల మంది నర్సులు అందుబాటు
- కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక బస్సులలో పరీక్షలు
- కోవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ 15,000 మంజూరు
అమరావతి: కరోనాను పటిష్టంగా ఎదుర్కోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వసన్నద్ధం అవుతోంది. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకొని దేశానికే ఆదర్శంగా నిలిచింది. తాజాగా కరోనా పై పోరుకు మరి కొన్ని అస్త్రాలను సిధం చేసే పనిలో నిమగ్నమయింది ప్రభుత్వం.
ఇందులో భాగంగా ఆసుపత్రుల్లో వైద్యానికి అవసరమైన 17 వేల మంది డాక్టర్లు, 12 వేల మంది నర్సులను అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తోంది. అలాగే ఈ విపత్తులో సేవలందిస్తున్న వారికి మంచి జీతాలు ఇవ్వాలని ఆదేశించారు. కోవిడ్ నివారణ చర్యలపై మంగళవారం సీఎం కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది.
అవసరాలకు అనుగుణంగా వైద్యులను, నర్సులను నియమించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటికే దీనికి సంబంధించిన డేటాబేస్ సిద్ధం చేశామని, దాదాపు 17 వేల వైద్యులు, 12 వేల నర్సుల సేవలు వినియోగించుకునే ప్రణాళిక సిద్ధం చేశారు.
ఈ సందర్భంగా సీఎం చేసిన పలు సూచనలు ఇలా ఉన్నాయి:
-> ప్రజలకు కోవిడ్ సోకిందన్న అనుమానం ఉంటే, వారు ఎవరిని సంప్రదించాలి అని తెలిపే ప్రోటొకాల్ సిద్ధం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి.
-> స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి.
-> క్వారంటైన్ సెంటర్లపై ఫోకస్ పెంచాలి. -> పారిశుధ్యం పై దృష్టి సారించాలి, అలాగే అన్ని రకాల వసతులు అందుబాటులోఉండాలి.
కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక బస్సుల ద్వారా కాంటాక్ ట్రేసింగ్ చేస్తున్నామని, టెస్టులో నెగటివ్ వచ్చినా ఎక్స్ రే లో తేడా ఉన్నా వారిని పాజిటివ్ గా పరిగణించి వైద్యం అందిస్తున్నామని అధికారులు తెలియజేశారు. పాజిటివ్ గా తేలిన వారు ఆసుపత్రి కి ఆలస్యంగా రావడం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయన్నారు
సమీక్షలో రాష్ట్రంలో కోవిడ్–19 పరీక్షలు, కేసుల తీరును అధికారులు వెల్లడించారు. సమీక్షకు హాజరు అయిన వారు: ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల నాని, ప్రభుత్వ సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి ఆ శాఖకు చెందిన ముఖ్య అధికారులు ఉన్నారు.