అమరావతి: ఏపీలో పెచ్చరిల్లుతున్న అరాచకాలు.. పోలీసులపై సైతం దాడులు: పేర్ని నాని
రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో చూస్తున్నామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ రాజ్యంగం అమలవుతోందని ఆరోపించారు.
గత రెండు నెలలుగా ఏపీలో నారా లోకేష్ ప్రకటించిన రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.
తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో ఎన్నడూ చూడని పోలీసు పోకడలను ఇప్పుడు చూస్తున్నామన్నారు. బీహార్, యూపీ రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రేరేపిత హింసను గతంలో చూశామని, ఇప్పుడు ఆ రాజకీయ ప్రేరేపిత హింసను ఏపీలో చూస్తున్నామని ఆయన విమర్శించారు.
పోలీసులపై దాడులు:
“తెలుగుదేశం, బీజేపీ, జనసేన నేతల చేతిలో పోలీసులు అగౌరవం పొందుతున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం శాంతి భద్రతలను కాపాడే పోలీసు విధి నిర్వహణను కొత్త పోకడలతో నడిపిస్తోంది. పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరుగుతోంది. చివరకు పోలీసులపైనా దాడులు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు,” అని పేర్ని నాని ప్రస్తావించారు.
సీతారామాపురం దారుణం:
నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామాపురంలో జరిగిన దారుణ హత్యను ఆయన అత్యంత హేయమన్నారు. ఈ ఘటనపై కూటమి ప్రభుత్వ పెద్దలు సిగ్గు పడాలని సూచించారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఎంత దిగజార్చిందో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అన్నారు. జిల్లా కేంద్రానికి కేవలం 12 కి.మీ దూరంలో ఉన్న సీతారామాపురంలో టీడీపీ మూకలు దాడి చేసి, దారుణంగా హత్య చేసినా, పోలీసులు స్పందించలేదని విమర్శించారు.
పరిస్థితి గురించి హెచ్చరించిన జయనారపురెడ్డిని భయపెట్టి, మహానంది పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తలదాచుకోవాలని సూచించారని పేర్ని నాని గుర్తుచేశారు. గతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తితే, పోలీస్ బెటాలియన్లు వేగంగా తరలి వచ్చేవి. కానీ ఇప్పుడు ఎవరైనా తమను ప్రత్యర్థులు చంపేస్తారని ఫోన్ చేస్తే, “మేము రక్షించలేము, పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తలదాచుకో” అని చెబుతున్నారని ఆయన అన్నారు.
గంజిపల్లి శ్రీనివాస్‌పై దాడి:
జగ్గయ్యపేటలో గంజిపల్లి శ్రీనివాస్‌పై పచ్చమూకలు దాడి చేశాయంటూ పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇవన్నీ చూస్తుంటే మనం ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నామా అన్న సందేహం కలుగుతోంది. మణిపూర్‌కు మించి రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, కాపాడే ప్రయత్నం చేయడం లేదు,” అని ఆయన ఆక్రోశం వ్యక్తం చేసారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఆరోపణలు:
ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ శాంతిభద్రతలపై మాటలతో ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పుడు ప్రజలకు చెప్పిన మాటల్ని అమలు చేయకుండా రాష్ట్రంలో హింసారాజ్యాన్ని నడుపుతున్నారని పేర్ని నాని ఆరోపించారు. “సూపర్ సిక్స్ గురించి చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో ప్రస్తావించకపోవడం దారుణం. సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది చంద్రబాబు కాదా?” అని నాని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్‌పై ప్రశ్నలు:
“పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు తాను కానిస్టేబుల్ కొడుకునని, ఖాకీ విలువ తెలుసని చెప్పారు. మరి ఇవాళ రాష్ట్రంలో పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ నోరెందుకు మెదపడం లేదు?” అని పేర్ని నాని ప్రశ్నించారు.
సీఎం నివాసంపై..:
“సీఎం చంద్రబాబు నివాసం ఉన్న ఇంటికి గతంలో మీ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రి నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆ ఇల్లు చంద్రబాబుగారిదా? లింగమనేని రమేష్‌దా? లేక ప్రభుత్వానిదా?” అని పేర్ని నాని ప్రశ్నించారు.