ఏపీ: రాష్ట్ర అభివృద్ధికి గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ నుంచి సహకారం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ సంస్థతో కీలక ఒప్పందానికి సంతకం చేసింది. విద్య, వ్యవసాయం, ఉపాది, సుపరిపాలన వంటి విభాగాల్లో గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించారు.
దీంతో ఈ ప్రాజెక్టును సమర్థవంతంగా ముందుకు నడిపేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏపీ ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసింది.
ఈ టాస్క్ ఫోర్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో పాటు గేట్స్ ఫౌండేషన్ బృందం కూడా ఉంటుంది. ప్రతిస్పందన, మానిటరింగ్, ప్లానింగ్‌ను సమన్వయం చేసే ఈ బృందం ద్వారా సహకారం మరింత సమర్థవంతంగా అమలవుతుంది.
ప్రభుత్వంతో కలిసి ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ఉంది.
ఆధునిక సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయం, విద్య, ఆరోగ్యం తదితర రంగాల్లో మెరుగైన ఫలితాలను సాధించాలనే దిశగా ఈ భాగస్వామ్యం కొనసాగుతుంది.
ప్రజల జీవనశైలిని మార్చే విధంగా మార్పులు రావాలన్నదే గేట్స్ ఫౌండేషన్ ఉద్దేశం. ఏపీలో ఈ మోడల్ విజయం సాధిస్తే, అది ఇతర రాష్ట్రాలకు కూడా మార్గదర్శకమవుతుంది.
ఇది పెట్టుబడుల ప్రాజెక్టు కాదు. ఉపాధి కల్పన కూడా కాదు. కానీ దీని ద్వారా వచ్చిన మార్పు, ప్రజల జీవితాల్లో నూతన అధ్యాయాన్ని తెరుస్తుందనే విశ్వాసంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇప్పుడు ఈ మిషన్ ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనే ఆసక్తి నిండిన దృష్టి రాష్ట్ర ప్రజలది.