fbpx
Thursday, September 19, 2024
HomeAndhra Pradeshఏపీ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రద్దు?

ఏపీ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రద్దు?

ap-grama-sachivalayam

అమరావతి: ఏపీ గ్రామ వార్డు సచివాలయం వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

త్వరలోనే ఈ సచివాలయ వ్యవస్థను రద్దు చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేయబోతోందని సమాచారం అందుతోంది.

కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే ఉద్దేశ్యంతో పెద్ద ఎత్తున మార్పులు చేపట్టబోతోందని తెలుస్తోంది.

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో జరుగనున్న ఈ ప్రక్షాళనలో భాగంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 10,960 గ్రామ సచివాలయాలు మరియు 4,044 వార్డు సచివాలయాలలో భారీ మార్పులు మరియు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మార్పులు గ్రామస్థాయి పరిపాలన విధానాన్ని పూర్తిగా ప్రభావితం చేసేలా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది.

రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీచేయడం, ప్రతి వ్యక్తి తన పనిని స్వయంగా నిర్వహించుకోవాలని సీఎం చంద్రబాబు కఠినంగా ఆదేశించారు.

ఈ నిర్ణయం వల్ల గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను సమూలంగా రద్దు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.61 లక్షల సచివాలయ కార్యదర్శులను ప్రభుత్వం ఇకపై అవసరాలకు అనుగుణంగా వినియోగించడానికి కొత్త విధానాలను ఆలోచిస్తోంది.

చిన్న పంచాయతీల్లో తక్కువమంది, పెద్ద పంచాయతీల్లో ఎక్కువ మంది ద్వారా ప్రజలకు సేవలు అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ప్రధానంగా గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి వంటి పోస్టులను ప్రాధాన్యతనిస్తూ, వార్డు సచివాలయాల్లో పరిపాలన, శానిటరీ, విద్య, సంక్షేమ, ఆరోగ్యం, మహిళా సంరక్షణ కార్యదర్శులు, ఏఎన్‌ఎం, వీఆర్వో వంటి ఉద్యోగాలను ప్రతిపాదించే అవకాశం ఉంది.

అదనంగా, గ్రామ సచివాలయ కార్యదర్శులను పంచాయతీరాజ్ పరిధిలోకి తీసుకొచ్చి, ఇతర అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

సచివాలయ ఉద్యోగుల్లో ఒకరిని డీడీవోగా నియమించడంతో పాటు, మిగిలిన కార్యదర్శులను క్లస్టర్ వ్యవస్థలో వినియోగించే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.

ఇంజినీరింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్/హార్టికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్, పశు సంవర్థక సహాయకులు వంటి పోస్టులను రద్దు చేసి, వాటిని మాతృ శాఖల్లో విలీనం చేసే యోచన కూడా ఉంది.

పంచాయతీ కార్యదర్శులను పంచాయతీరాజ్ పరిధిలో మాత్రమే పరిమితం చేయాలని, ఈ విధానంతో గ్రామ పంచాయతీల నిర్వహణలో మరింత సమర్థత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ మార్పులన్నీ అమలులోకి వస్తే, రాష్ట్రంలో గ్రామస్థాయి పరిపాలనలో విశేష మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular