అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో గతంలో జరిగిన జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపుకు రాష్ట్ర హైకోర్టు ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించుకోవచ్చునని డివిజన్ బెంచ్ తెలిపింది.
ఈ రోజు ఉదయం హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను హైకోర్టు ఈ సందర్భంగా సమర్థించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న 515 జెడ్పీటీసీ, 7220 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహించబడ్డాయి.
కాగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఏప్రిల్ 10న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా అప్పట్లో హైకోర్టు సింగిల్ బెంచ్ ఎన్నిక కౌంటిoగ్ ను వాయిదా ఉత్తర్వులతో ఈ కార్యక్రమానికి బ్రేక్ పడింది. అలాగే మొదటి నుంచి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని కూడా హైకోర్టు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై హైకోర్టు డివిజన్ బెంచ్‌ని ఎస్‌ఈసీ ఆశ్రయించింది.
ఎస్‌ఈసీ తన వాదనలో డివిజన్ బెంచ్ ఉత్తర్వుల ప్రకారమే జడ్పీటీసి, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించామని వినిపించింది. తిరిగి ఎన్నికలను మొదటి నుండి నిర్వహించడం ఇప్పుడున్న పరిస్థితులలో అసాధ్యమని దానితో పాటు కోట్లాది రూపాయిలు వృధా అవుతాయని కూడా ఎస్‌ఈసీ పేర్కొంది. నేడు హైకోర్టు, కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో న్యాయ పరమైన చిక్కులు తొలిగాయి. దీంతో కౌంటింగ్ ప్రక్రియకు ఎస్‌ఈసీ కసరత్తు ప్రారంభించింది.