అమరావతి: ఏపీ హోం మంత్రి పీఏపై ప్రభుత్వ వేటు: అవినీతి ఆరోపణలతో తొలగింపు
హోం మంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్న సంధు జగదీష్‌పై తొలగింపు చర్యలు తీసుకున్నారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఎక్కువ అవడంతో ప్రభుత్వం చివరికి కఠిన నిర్ణయం తీసుకుంది.
జగదీష్‌పై బదిలీలు, పోస్టింగ్‌లు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లు జరిపారని ఆరోపణలు ఉన్నాయి. గత పదేళ్లుగా అనిత వద్ద పీఏగా ఉన్న జగదీష్ ఆమె హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత ధైర్యంగా వ్యవహరించినట్లు సమాచారం.
తెదేపా శ్రేణులు, అనితను కలవటానికి వచ్చిన పలువురు నేతలు, కార్యకర్తలు జగదీష్ ప్రవర్తనపై అసంతృప్తిగా ఉన్నారు. అయినప్పటికీ అనిత ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు దారి తీసింది.
తాజాగా పాయకరావుపేట నియోజకవర్గం తెదేపా సమావేశంలో అనిత స్వయంగా జగదీష్‌ను పీఏ పదవి నుంచి తొలగించిన విషయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం కార్యకర్తలలో ఆనందం నింపింది.
అసంతృప్తికి కారణమైన జగదీష్ వ్యవహారం
జగదీష్ తన అధికారిక స్థాయిని దాటి పలువురిపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపణలున్నాయి. ఎస్.రాయవరం మండలంలోని తెదేపా నాయకులు జగదీష్ వ్యవహారంపై అంతర్గతంగా చర్చలు జరిపినప్పటికీ, ఆయన బెదిరింపు ధోరణి కారణంగా నోరుమూసుకున్నారు.
పేకాట శిబిరాలు, మద్యం దుకాణాల అవినీతి
ఎస్.రాయవరం, పాయకరావుపేట మండలాల్లో పేకాట శిబిరాలు జగదీష్ అండతో నడిచాయని ఆరోపణలున్నాయి. మద్యం దుకాణాల లైసెన్సుదారులపై ఒత్తిడి తీసుకొచ్చి వాటాలు పొందారని కూడా సమాచారం.
తిరుమల సిఫార్సు లేఖల అక్రమ విక్రయం
తిరుమల దర్శన సిఫార్సు లేఖలను ప్రైవేటు హోటల్ ద్వారా అమ్ముకున్నట్లు కూడా జగదీష్‌పై ఆరోపణలు వినిపించాయి.