అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల అవనున్నాయి. దీనికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ శుక్రవారం ఉదయం 11 గంటలకు 2021-22 జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయబోతున్నారు.
ఇకపై రాష్ట్రంలో ప్రతి ఏటా ఉద్యోగాల ఖాళీలు ప్రకటించి, వాటిని భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంలో ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ ప్రకటన ఇవాళ విడుదల చేయబోతోంది.
ఈ క్యాలెండర్ లో భాగంగా విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. అయితే అత్యంత పారదర్శకంగా ఈ ఉద్యోగాల నియామకాలు చేపట్టనుంది. అవినీతి, వివక్షకు ఎటువంటి తావులేకుండా మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల భర్తీని చేపట్టనుంది.
ఈ జాబ్ క్యాలెండర్ లో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగులు ఇలా అన్ని రకాల నియామకాలు ఉండబోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఉదయం 11.00 గంటలకు సీఎం తన క్యాంపు ఆఫీసు నుండి విడుదల చేయనున్నారు.