అమరావతి: వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ఒక ప్రకటనలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీసర్వే చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీని కోసం 4,500 సర్వే టీమ్‌లను సిద్దం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక సమగ్ర భూసర్వే కోసం రూ. 1000 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు.
2021 జనవరి నుంచి జూన్ 2023 నాటికి పలు దశల వారీగా రీసర్వే చేయనున్నట్లు తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని, గ్రామ సచివాలయాలలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫిజికల్ బౌండరీలను ఫిక్స్ చేస్తామని, సర్వే రాళ్లను ప్రభుత్వమే అందజేస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో మళ్లీ వందేళ్ల తర్వాత భూ సర్వేను చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ అనంతరం వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో ఈ విషయాన్ని తెలిపారు.