ఏపీ: లిక్కర్ స్కాం కేసులో మరోసారి ఉత్కంఠత నెలకొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అతడిని అరెస్టు చేసినట్లు సమాచారం.
దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కాసేపటికే, పక్కా సమాచారంతో అక్కడే సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని పట్టుకున్నారు. ప్రస్తుతం అతడిని విజయవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఇక ఇదివరకు రాజ్ కసిరెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. విచారణకు సమయం తీసుకోవడంతో, రేపు విచారణకు హాజరవుతానని స్వయంగా వెల్లడించాడు. అయితే ఆ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే అతడు అరెస్ట్ కావడం చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసులో ఇప్పటికే పలు కీలక వ్యక్తులు సిట్ ఎదుట హాజరయ్యారు. ఎంపీ అభిరామి, విజయసాయిరెడ్డి వంటి నేతలు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. రాజ్ కసిరెడ్డిపై మాత్రం భారీ ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడిలా అతడు అరెస్టుకావడం, లిక్కర్ స్కాం దర్యాప్తులో కీలక మలుపు తిరిగినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజ్ కసిరెడ్డి ఏం బయటపెడతాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.