అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ రాష్ట్రంలో అక్రమ మద్యం అరికట్టాలని అందుకోసం తగిన పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు ఆదేశాలు జారి చేశారు. మంగళవారం ఆయన విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు అక్రమ మద్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
రాష్ట్రంలో 2019లో 4,500గా ఉన్న మద్యం దుకాణాలను ప్రస్తుతం 2,934కు పరిమితం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఇతర చర్యల వల్ల రాష్ట్రంలో మద్యపాన వినియోగం ఘననీయంగా తగ్గిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
రాష్ట్రంలో బీరు అమ్మకాలు 70 శాతం మరియు మద్యం అమ్మకాలు 40 శాతం వరకు తగ్గినట్లు తెలిపారు. అలాగే అక్రమ మద్యం వినియోగం కూడా పెరగకుండా చూసేందుకు ఎస్‌ఈబీ, విజిలెన్స్ విభాగాలతో ఎక్సైజ్ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని అన్నారు.
ఈ చర్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ మద్యం దుకాణాలను కూడా అప్పుడప్పుడూ తనిఖీలు నిర్వహిస్తూ పనితీరును సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ విధానాలతో ఈ విషయంలో సానుకూల ఫలితాలను సాధించేలా అధికార యంత్రాంగం దృష్టి సారించాలని కోరారు. అలాగే ఏపీ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ డి.వాసుదేవరెడ్డి, ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ కేఎల్ భాస్కర్‌లతోపాటు అన్ని జిల్లాల డిప్యూటీ కమిషనర్లు, డిపో మేనేజర్లు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.