అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా జరగనున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న 24 మంది స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశ కార్యక్రమంలో అజెండా అంశాలపై చర్చ పూర్తయ్యాక మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు సమర్పించారు.
2019 ఎన్నికలలో గెలిచిన తరువాత ఏర్పడిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడే రెండున్నరేళ్ల తర్వాత మంత్రులను మార్చి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని, కొత్తవారికి మంత్రులుగా అవకాశం కల్పిస్తామని చెప్పారు, కానీ తమకు 34 నెలలపాటు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఇచ్చారని సీఎం జగన్‌కు మంత్రులంతా కృతజ్ఞతలు తెలిపారు.
రాజీనామాలపై ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా తామంతా కట్టుబడి ఉంటామని, తమకు ఏ ఇతర బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో, అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు.