ఆంధ్రప్రదేశ్: ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయవాడలో ఈ క్రీడలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. వయస్సు, హోదాలను పక్కనపెట్టి ప్రజా ప్రతినిధులు చిన్న పిల్లల మాదిరి మైదానంలో చెలరేగిపోతున్నారు.
అయితే, క్రీడలకు ఫిట్‌నెస్ ఎంతో అవసరం. వ్యాయామానికి అలవాటు లేకుండా రాజకీయాల్లో బిజీగా ఉన్న నేతలకు కొంత గ్యాప్ రావడం సహజం. ఆ కారణంగా కొందరు క్రీడల సందర్భంగా గాయపడడం కూడా జరుగుతోంది.
గురువారం ఉదయం జరిగిన కబడ్డీ పోటీల్లో టీడీపీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గాయపడ్డారు. ప్రత్యర్థిని పట్టుకునే క్రమంలో అదుపు తప్పి వెనక్కి పడిపోవడంతో తల వెనుక కుర్చీలపై పడింది. దీంతో ఆయన తలకు స్వల్ప గాయమైంది.
అలాగే, పులివెందుల టీడీపీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కూడా గాయపడ్డారు. క్రీడల్లో పాల్గొనడం ఉత్సాహంగా ఉన్నా, ఆటల కోసం శారీరకంగా సిద్ధంగా ఉండటం ఎంత అవసరమో ఈ ఘటనలు రుజువు చేశాయి. బుచ్చయ్య, రెడ్డి, శ్రీధర్‌లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.