ఢిల్లీ: ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 15న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి నామినేషన్లను స్వీకరణ జరుగుతుంది. మార్చి 4 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువును ప్రకటించారు. మార్చి 5న నామినేషన్ల పరిశీలన కాగా, మార్చి 8 వరకు ఉపసంహరణ గడువు విధించారు.
మార్చి 15న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు కౌంటింగ్ నిర్వహించనున్నారు. మార్చి 29తో నలుగురు ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామాతో ఏర్పడిన స్థానంతో పాటు, చల్లా రామకృష్ణారెడ్డి మృతితో ఏర్పడిన స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఖాళీ కానున్న తిప్పేస్వామి, సంధ్యారాణి, వీరవెంకటచౌదరి, షేక్ అహ్మద్ ఇక్బాల్ స్థానాలకు మొత్తం ఆరు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
►ఈనెల 25న నోటిఫికేషన్, మార్చి 15న ఎన్నిక
►నామినేషన్ల స్వీకరణకు మార్చి 4 తుదిగడువు
►మార్చి 5న నామినేషన్ల పరిశీలన
►మార్చి 8న నామినేషన్ల ఉపసంహరణ
►మార్చి 15న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్
►అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్