అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటాలోని రెండు స్థానాల్లో ఒక స్థానంలో ఎస్సీ, మరొక స్థానంలో ముస్లిం వర్గాలకు కేటాయించనున్నట్టు సమాచారం. ప్రభుత్వం నుండి త్వరలోనే ఈ మేరకు సిఫార్సు అందనుందని వైఎస్సార్‌సీపీ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతానికి ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలిలో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణారావు ఇటీవల రాజ్యసభకు ఎన్నికై రాజీనామా చేసిన కారణంగా శాసనసభ నుంచి ఎన్నికయ్యే ఇద్దరి స్థానాలు ఖాళీ అయ్యాయి.
ఇక గవర్నర్ కోటాలో నామినేట్ చేసే రెండు స్థానాల్లో కంతేటి సత్యనారాయణరాజు, రత్నాబాయిల పదవీ కాలం ఈ మధ్యనే ముగిసినందున ఖాళీ అయిన రెండు స్థానాలు కొంత కాలంగా భర్తీకి నోచుకోలేదు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం శాసన మండలిని రద్దు చేయాలని ఇంతకుముందే నిర్ణయించినప్పటికీ పైస్థాయిలో ఆలస్యం కారణంగా ఇప్పటికీ మనుగడలో ఉంది. అయితే మండలి రద్దు విషయంలో ఎలాంటి రెండో ఆలోచన ప్రభుత్వానికి లేదు.
ఇప్పటికే శాసనసభలో మండలి రద్దుకు తీర్మానం చేసి పంపారు, అయితే మండలి మనుగడలో ఉన్నంత వరకైనా ఖాళీ స్థానాలను భర్తీ చేయాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి ఉన్నట్టు తెలుస్తోంది.