అమరావతి: ఏపీలో నేడు 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. 12 నగరపాలక సంస్థలు, 75 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా, వైఎస్సార్ జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
ఏకగ్రీవమైనందున ఇక ఆ నాలుగు పట్టణాల్లో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలను యథాతథంగా నిర్వహించేందుకు హైకోర్టు అనుమతించడంతో ఆ విషయంలో కూడా అడ్డు తొలగింది. వివిధ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏకగ్రీవమైన వార్డులు పోనూ మొత్తం 2,214 వార్డులు/డివిజన్లలో 7,549 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఈ ఎన్నికలలో మొత్తం 77,73,231 మంది ఓటర్లు ఈ రోజు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లను చేసింది. పోలింగ్ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టింది.
పర్యవేక్షిన నిమిత్తం ప్రభుత్వం 13 జిల్లాల్లో ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారి చొప్పున ప్రత్యేకంగా నియమించింది. ఓటర్ల ఫొటోలతో కూడిన ఓటర్ స్లిప్పుల పంపిణీ కూడా ఈ పాటికే పూర్తయ్యింది. సకాలంలో పోస్టల్ బ్యాలెట్ పత్రాల జారీని కూడా పూర్తి చేసింది. పోలింగ్ నిర్వహణకు అవసమైన బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రిని పోలింగ్ సిబ్బందికి మంగళవారం పంపిణీ చేశారు. వైద్య సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచారు.
ఈ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. సున్నిత, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో మరింత బందోబస్తు ఏర్పాట్లు చేసింది.