అమరావతి: కోవిడ్ నేపథ్యంలో ఏపీలో అమలులో ఉన్న రాత్రి కర్ఫ్యూని మరో వారం పాటు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపింది. అదే విధంగా ప్రజలందరూ కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది.
రాష్ట్రంలో కోవిడ్ వ్యాప్తి నివారణ మరియు కోవిడ్ వ్యాక్సినేషన్‌పై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ తన క్యాంప్ ఆఫీస్ లో సమీక్ష నిర్వహించారు. ఒకవేళ రాష్ట్రంలో థర్డ్‌వేవ్ వస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులను ఆదేశించారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలలో నిర్మించదలచిన పీడియాట్రిక్ సూపర్ కేర్ ఆస్పత్రుల పనులను త్వరితగతిన పుర్తి చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని పోలీస్ బెటాలియన్స్‌లో కూడా కోవిడ్ కేర్ ఎక్విప్‌మెంట్ ఏర్పాటుతో పాటు అవసరమైన మేరకు వైద్యులను నియమించాలి. కమ్యూనిటీ ఆస్పత్రుల స్ధాయి వరకు ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో ఉండేలా పఠిష్టమైన చర్యలను తీసుకోవాలన్నారు. ఇంకా రాష్ట్రంలో ఉన్న అన్ని పీహెచ్‌సీలల్లో కూడా ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్ల లభ్యత ఉంచేలా చర్యలు తీసుకోవలన్నారు.
ఇక సబ్‌సెంటర్లల్లో టెలీమెడిసిన్ సేవలు, ఇంటర్‌నెట్ సౌకర్యం అందుబాటులో ఉంచాలి. అలాంటి వసతులు కల్పిస్తే వారితో పీహెచ్‌సీల వైద్యులు కూడా వీసీ ద్వారా అందుబాటులోకి తీసుకురావచ్చన్నారు. కోవిడ్ అంక్షల్లో భాగంగా మరో వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూ కొనసాగించాలి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు కొనసాగించాలి. కోవిడ్ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి అని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.