అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ జాతీయ స్థాయిలో మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. తమ అత్యుత్తమ ప్రతిభతో ‘స్కోచ్’ అవార్డుల్లో సగం కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటుకుంది.
రాష్ట్రం నిర్వహిస్తున్న దిశ, పోలీస్ సేవా యాప్‌లకు బంగారు పతకాలు రాగా, మరికొన్ని విభాగాల్లో రజత పతకాలను రాష్ట్ర పోలీస్ శాఖ దక్కించుకుంది. పోలీస్ శాఖలో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్ గ్రూప్ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో భాగంగా బుధవారం జాతీయ అవార్డులను ప్రకటించింది.
ఆ అవార్డు వివరాలను ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. స్కోచ్ గ్రూప్ మొత్తం 83 జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించగా, రాష్ట్ర పోలీస్ శాఖ రికార్డు స్థాయిలో 48 అవార్డులను దక్కించుకొని మొదటి స్థానంలో నిలిచింది.
ఆ తర్వాతి స్థానాల్లో కేరళ(9), మహారాష్ట్ర(4), పశ్చిమ బెంగాల్(4), హిమాచల్ ప్రదేశ్(3), మధ్యప్రదేశ్(2), తమిళనాడు(2), ఛత్తీస్‌గఢ్(2) ఉన్నాయి. ఇక తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అసోం, బిహార్, గుజరాత్, హరియాణా, ఒడిశా, పంజాబ్ తదితర రాష్ట్రాలు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కించుకున్నాయి.