న్యూఢిల్లీ: సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో నిర్వహించిన 54వ జీఎస్టీ మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రతిపాదనలు చేశారు.
కేశవ్ మొత్తం 8 ముఖ్య అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు. ముఖ్యంగా, ఈ సమావేశం తర్వాతి కౌన్సిల్ సమావేశాన్ని ఏపీలో నిర్వహించాలని మంత్రి పయ్యావుల స్నేహపూర్వక ఆహ్వానం పలికారు.
పయ్యావుల కేశవ్ పేదలకు మరియు ముఖ్య రంగాలకు మేలు చేకూరేలా జీఎస్టీ పరంగా కొన్ని మినహాయింపులు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రతిపాదనలు చేశారు.
ఇందులో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ సేవలకు సంబంధించి జీఎస్టీని రద్దు చేయాలని అభ్యర్థించారు.
మద్యం తయారీలో ఉపయోగించే ఎక్స్‌ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ పై ఉన్న జీఎస్టీని వ్యాట్ పరిధిలోకి మార్చాలని విజ్ఞప్తి చేశారు.
అలాగే, ఆరోగ్య మరియు జీవిత బీమాలకు సంబంధించిన జీఎస్టీని 15 శాతం నుండి 5 శాతానికి తగ్గించాలని సూచించారు.
ఇలా చేస్తే సాధారణ ప్రజలకు భారం తగ్గుతుందని మరియు వృద్ధులు, మానసిక వికలాంగులకు గల ఆరోగ్య బీమాలకు సంబంధించి జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని పయ్యావుల కోరారు.
ఇక ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలపై ఉన్న 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని, అలాగే ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల పైన కూడా తగ్గింపును అమలు చేయాలని ప్రతిపాదించారు.
ఇలాంటి మార్పులు పర్యావరణ అనుకూల సమాజం నిర్మాణానికి దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పయ్యావుల, జీఎస్టీ చట్టం సెక్షన్ 16(4) కారణంగా వస్తున్న ఇబ్బందులను నివారించి, పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
విద్యా సంస్థలు మరియు యూనివర్శిటీలలో శాస్త్ర, సాంకేతిక రంగాలను ప్రోత్సహించేందుకు వచ్చే గ్రాంట్లపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు.