ఏపీ: రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక చర్యలకు దిగింది. సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి, దేశ వ్యాప్తంగా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేయాలనే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు.
ఇప్పటికే తెలంగాణ ఈ దిశగా అడుగులు వేసింది, దీనిపై ఏపీ కూటమి పార్టీల మధ్య పలు చర్చలు జరుగగా, ఎస్సీ వర్గీకరణ బాధ్యతను టీడీపీపై అప్పగించడం జరిగింది.
రాష్ట్రంలోని ఎస్సీ జనాభా జిల్లాల వారీగా వేరువేరుగా ఉండటం వల్ల, ఏపీ ప్రభుత్వం వర్గీకరణను జిల్లా ప్రాతిపదికన అమలు చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఇది మాలలు, మాదిగలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అనుగుణంగా రిజర్వేషన్ వర్గీకరణను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ఉంది.
రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా కాకుండా, ప్రతి జిల్లాను ప్రత్యేక యూనిట్‌గా తీసుకోవడం ద్వారా అన్యాయం జరగకుండా చట్టబద్ధంగా రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయించారు.
ఈ నిర్ణయం ద్వారా, వర్గీకరణలో సమానత్వం పాటించడం, వర్గాల మధ్య సమన్యాయం ఏర్పరచడం సులభమవుతుంది. ఎస్సీ వర్గీకరణ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ఇది ఒక కీలక నిబంధనగా మారుతుందని భావిస్తున్నారు.