అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన అన్ని రకాల ప్రవేశ పరీక్షలను (సెట్లు) రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. జాతీయ ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈ మరియు ఇతర విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో ఇప్పటికే తల్లిదండ్రులు మరియు విద్యార్థుల నుండి వినతులు అందాయి. ఈ అంశాలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళడంతో ఆయన అన్ని రకాల సెట్లని వాయిదా వేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.
రాష్ట్రంలో జరిగే ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ మరియు ఇతర వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ సహా అన్ని రకాల సెట్లని సెప్టెంబర్ మూడవ వారానికి వాయిదా వేశారు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన ఉన్నత విద్యామండలి కార్యాలయంలో మీడియాకు తెలియజేశారు.
జేఈఈ, నీట్ లాంటి జాతీయ పరీక్షలు షెడ్యూల్ తో ఇబ్బంది లేకుండా 8 ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మూడో వారానికి వాయిదా వేస్తున్నట్లు, అలాగే షెడ్యూల్ ను త్వరలో ప్రకటిస్తామన్నారు. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసి పరీక్షలు నిర్వహించడానికి చర్యలు చేపట్టింది. తల్లిందండ్రుల విజ్ఞప్త్రి మేరకు వీటిని వాయిదా వేయాలని సీఎం ఆదేశించారు.
డిగ్రీ కోర్సులలో చివరి సంవత్సరం పరీక్షలను ఖచ్చితంగా నిర్వహించాలన్న యూజీసీ ఆదేశాల మేరకు వాటిని నిర్వహించే బాధ్యత ఆయా యూనివర్సిటీలకే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రయివేటు విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా పలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు, ఫీజులు వసూలుకు ఒత్తిడి చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చాయన్నారు. ప్రయివేటు విద్యాసంస్థలలో విద్యా ప్రమాణాల పెంపునకు, ఫీజులు నిర్ణయించేందుకు ప్రభుత్వం పాఠశాల నియంత్రణ, పర్యవేక్షణ కమీషన్ ను ఏర్పాటు చేసిందన్నారు. పలు విద్యాసంస్థలపై ఫిర్యాధులు అందాయని, వాటిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.