అమరావతి: కరోనా వైరస్ మహ్హమ్మారి ని బాగా నియంత్రణలో ఉంచిన రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈ రాష్ట్రాలు కనబర్చిన ప్రతిభ భారతదేశంలో చెప్పుకోదగ్గదని, ఈ రాష్ట్రాలు ప్రతిస్పందించిన తీరు ఆమోఘమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు వెల్లడించారు.
రెండు రాష్ట్రాల్లో 10 వేల మంది కాంటాక్టు వ్యక్తుల వివరాలు సేకరించి వారు పరిశోధన జరిపారు. ఇప్పటివరకూ జరిపిన అతిపెద్ద పరిశోధన, సర్వే ఇదేనని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. దీనిపై సమగ్ర విశ్లేషణ జరపగా, భారతదేశం లాంటి 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలు చాలా అద్భుతంగా శ్రమించాయని, కోవిడ్ నియంత్రణలో తమదైన శైలిలో పోరాడాయని పేర్కొన్నారు.
కరోనా వైరస్ సంక్రమణ, వ్యాప్తిని ప్రజలకు తెలియజేయడంలో ఏపీ, తమిళనాడు బ్రహ్మాండంగా పనిచేశాయి. ప్రాథమిక సంరక్షణ, వైద్య బాధ్యతలు నిర్వర్తించడంలో అద్భుతంగా పనిచేశాయి. లక్షణాలున్న వారిని గుర్తించడానికి రోజువారీ 5 కిలోమీటర్ల దూరం ఇంటింటికీ వెళ్లి నమూనాలు సేకరించి మరీ వారికి వైద్యం అందించారు.
చిన్నారుల్లో కూడా అదే వయసు వారికి ఎక్కువగా వ్యాప్తి అయింది. కేసుల సారూప్యత, వయసుల వారీగా తేడాలు, సంక్రమణ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు వంటి వాటిని తక్కువ సమయంలో గుర్తించగలిగారు. 70 శాతం మంది పాజిటివ్ వ్యక్తుల నుంచి ఇతరులకు ఎలాంటి సంక్రమణ కాలేదు. 8 శాతం మంది పాజిటివ్ వ్యక్తులు 60 శాతం కొత్త అంటువ్యాధుల్ని కలిగి ఉన్నారు.
రెండు రాష్ట్రాల్లో మృతుల్లో మహిళల కంటే పురుషులు 62 శాతం ఎక్కువగా ఉన్నారు. మరణించిన వారిలో 63 శాతం మందికి ఏదో ఒక అనారోగ్యం ఉందని తేలింది. మొత్తం మృతుల్లో 45 శాతం మంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారు. 36 శాతం మందిలో రెండు లేదా అంతకు మించిన జబ్బులున్నాయి. మృతుల్లో 85 సంవత్సరాల వయసు వారు 16.6 శాతం ఉన్నారు. భారత్‌లో లాక్‌డౌన్ వల్ల ఒకరి నుంచి మరొకరికి సంక్రమణ వేగం బాగా తగ్గిందని తెలిపింది.