కడప : ఏపి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల ఇండస్ట్రియల్ ఏరియాలో ఏర్పాటు చేయనున్న అపాచీ లెదర్ ఇండస్ట్రీకి గురువారం ఘనంగా శంకుస్థాపన చేశారు. భూమి పూజ అనంతరం అపాచీ ఇంటెలిజెంట్ గ్రూప్ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి ఒక మొక్కను నాటారు.
భూమి పూజ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్ భాష, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా, అపాచీ లెదర్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇంటెలిజెంట్ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ జాన్సన్ చాంగ్, తైపే ఎకనామిక్ కల్చర్ సెంటర్ డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్, అపాచీ గ్రూప్ జనరల్ మేనేజర్ గవిన్ చాంగ్, వీజీఎం ముత్తు గోవింద స్వామి, వైస్ ప్రెసిడెంట్ సైమన్ చెంగ్, డైరెక్టర్లు సీన్ చెన్, హరియెట్లీ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ప్రభుత్వం తైవాన్ ప్రభుత్వంతో కలిసి ఈ ప్రాజెక్టును ప్రారంభించామన్నారు. అడిడాస్ బ్రాండెడ్ షూస్ తయారీలో అపాచీ కంపెనీ కీలకం. భారత దేశంతో పాటు వియాత్నం, చైనాలోనూ అపాచీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 2006లో వైఎస్సార్ హయాంలో తడలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. తడ ఫ్యాక్టరీ ద్వారా ప్రతిఏటా కోటి 80 లక్షల ప్రొడక్షన్ జరుగుతోంది. 11 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు.
ఈ సందర్భంగా పులివెందులలో తమ కంపెనీని విస్తరిస్తున్నామన్నారు కంపెనీ ప్రతినిధులు. ఈ కంపెనీ ద్వారా 2వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇందులో 50 శాతం మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. శ్రీకాళహస్తిలో కూడా భూమిని కేటాయించారు. అక్కడ కూడా రూ.350 కోట్లతో పరిశ్రమను నెలకొల్పుతున్నారు. శ్రీకాళహస్తి పరిశ్రమ ద్వారా 5వేల మందికి ఉపాధి లభిస్తుంది. ప్రపంచ బ్యాంకుతో కలిసి కేంద్రం రిలీజ్ చేసిన ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. పెట్టుబడులను ఆకర్షించడంలో దేశంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు.