ముంబై: భారత్ లో కోవిడ్ మహమ్మారి మరణ మృదంగం మోగిస్తున్న నేపథ్యంలో ప్రపంచ టెక్ దిగ్గజం అయిన ఆపిల్ ఇవాళ స్పందించింది. దేశంలో మహమ్మారి నివారణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న సహాయక చర్యలకు తాము సహకరిస్తామని ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు.
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో వైద్యులు, కార్మికులు, యాపిల్ కుటుంబం సహా భయంకరమైన ఈ మహమ్మారితో పోరాడుతున్న ప్రతి ఒక్కరి గురుంచి మేము ఆలోచిస్తున్నామన్నారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సహాయక చర్యలకు మద్దతుగా ఆపిల్ విరాళం ఇవ్వనుంది అని టిమ్ కుక్ ట్విటర్ ద్వారా ప్రకటన చేశారు.
ఇటీవలే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కరోనాతో పోరాడుతున్న భారతదేశానికి వారి మద్దతును తెలిపారు. గూగుల్ తరఫున రూ.135 కోట్ల విరాళం అందిస్తున్నట్లు పిచాయ్ ప్రకటించగా, దేశంలో కొనసాగుతున్న సహాయక చర్యలకు తోడ్పడేలా ఆక్సిజన్ కాన్సంట్రేషన్ యంత్రాల కొనుగోలుకు చేయూతనిస్తామని నాదెళ్ల ప్రకటించారు.