టాలీవుడ్: తెలుగు లో వచ్చే కొన్ని చిన్న సినిమాలు అద్భుతంగా ఆడతాయి. ఈ చిన్న సినిమాలు కొన్ని కథని నమ్ముకుంటే, కొన్ని బూతును నమ్ముకుంటాయి. రెగ్యులర్ గా వచ్చే పెద్ద హీరోల సినిమాల్లో ఫాన్స్ ఊహాగానాల కోసం ప్రొడ్యూసర్ల లాభాల కోసం ప్రయోగాలు చేసే అవకాశాలు తక్కువ ఉంటాయి. కానీ చిన్న సినిమాలకి ఆ వెసులుబాటు ఉంటుంది. చిన్న సినిమాలని చూసే ప్రేక్షకులు కూడా అదే అంచనాలతో వెళ్తారు. నిజం చెప్పాలంటే మంచి కథతో వచ్చిన సినిమానే పెద్ద సినిమా. అలాంటి కథ, కథనాలను నమ్ముకొని వస్తున్న సినిమా ‘కలర్ ఫోటో’. నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులని కాకుండా మిగతా సినిమా ఆర్టిస్టులని కూడా బాగానే ఆకట్టుకుంది.
ఈ సినిమా టీజర్ ని చూసిన వెన్నెల కిషోర్ ట్విట్టర్ లో ఇలా స్పందించాడు. ‘చూడటానికి కాస్త ఆలస్యమైంది.. ఎంతో స్వీట్, ఫీల్ గుడ్‌లా ఉంది. నిర్మాత సాయి రాజేష్ పట్ల ఎంతో సంతోషంగా ఉంది..ఈ మొదటి చిత్రం డైరెక్టర్ సందీప్ రాజ్‌కు విజయాన్ని చేకూర్చాలి.. సుహాస్ తన ట్రెండింగ్ నటనతో ఫైర్ మీదున్నాడు. చాందినీ, సునీల్ సార్, వైవా హర్ష అందరూ బాగా చేశారు’ అని ప్రశంసలు కురిపించాడు. దీనికి బ్రహ్మాజీ రిప్లై ఇస్తూ ‘అన్నీ బాగున్నాయ్. . కాకా.. ఈ సుహాస్ ని తొక్కేయాలి.. ఫుల్ టాలెంట్ ఉంది.. లేకపోతే మనకే డేంజర్’ అంటూ ఫన్నీగా స్పందించాడు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాతో సుహాస్ కే ఎక్కువ గుర్తింపు వచ్చింది. సినిమా కూడా అలాగే మంచి గుర్తింపు రావాలని ఆశిద్దాం.