జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో ఖాళీ సీట్ల కోసం లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశం కోసం అప్లై చేసుకోండిలా..
జాతీయం: దేశవ్యాప్తంగా 653 జవహర్ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్‌వీ) తొమ్మిదో తరగతిలో ఖాళీ సీట్ల కోసం లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రవేశానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య, వసతి సౌకర్యాలు అందించబడతాయి. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 8, 2025న నిర్వహించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ రోజు (అక్టోబర్ 30, 2024)లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
ప్రవేశ అర్హతలు:
- స్థానిక నివాసం: విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి.
- శిక్షణ స్థాయి: 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతూ ఉండాలి.
- వయసు: విద్యార్థి జన్మతేది 01.05.2010 నుంచి 31.07.2012 మధ్య ఉండాలి.
ప్రవేశ పరీక్ష వివరాలు:
పరీక్ష మొత్తం 100 ప్రశ్నలతో, 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు నాలుగు విభాగాలుగా ఉంటాయి:
- హిందీ: 15 ప్రశ్నలు – 15 మార్కులు
- సైన్స్: 35 ప్రశ్నలు – 35 మార్కులు
- మ్యాథమెటిక్స్: 35 ప్రశ్నలు – 35 మార్కులు
- ఇంగ్లిష్: 15 ప్రశ్నలు – 15 మార్కులు
ఈ పరీక్షా పత్రం హిందీ మరియు ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి 2.30 గంటలు.
దరఖాస్తు విధానం:
జేఎన్‌వీ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్ సాఫ్ట్ కాపీ, విద్యార్థి ఫొటో, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్, నివాస ధ్రువపత్రాలు అప్‌లోడ్ చేయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు: www.navodaya.gov.in