అమరావతి: ఏపీ లో జరిగే పోటీ పరీక్షల్లో గ్రూప్ -1 పోస్టుల్లో మినహా మిగతా అన్ని క్యాడర్ పోస్టుల భర్తీకి జరిగే పరీక్షల విధానంలో సమూల మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భావిస్తోంది. మిగతా క్యాడర్ పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షల నిర్వహణను రద్దు చేయాలని ఆలోచిస్తోంది. రాష్ట్రంలో గ్రూప్ – 1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ఇప్పుడు మొదటగా ప్రిలిమ్స్/స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి అందులో అర్హత సాధించిన వారికి మాత్రమే మెయిన్స్ పరీక్షను నిర్వహిస్తున్నారు.
కాగా ఇక నుండి గ్రూప్ – 2, గ్రూప్ – 3 తో పాటు మిగిలిన క్యాడర్ పోస్టులకు అన్నింటికీ ప్రిలిమ్స్ పరీక్షలను రద్దు చేసే దిశగా కమిషన్ ఆలోచిస్తోంది. కేవలం ఒక్క పరీక్షతోనే మెరిట్ అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేసి భర్తీ చేయనున్నారు. ఇందుకు ప్రతిపాదనలను కూడా సిద్ధం చేస్తున్నట్లు పబ్లిక్ కమిషన్ వర్గాలు వివరించాయి.
ఇప్పుడు అమలు లో ఉన్న ప్రిలిమ్స్ నిర్వహణతో అభ్యర్థులకు ఆర్థిక భారం, మరియు వ్యయప్రయాసలకు గురవుతుండగా కోచింగ్ పేరిట కొన్ని సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. గతంలో గ్రూప్–1 పోస్టులకే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల విధానం ఉండేది. గ్రూప్–2, గ్రూప్–3 పోస్టులకు ఒక పరీక్ష ద్వారానే ఎంపికలు జరిగేవి. 2014లో ఈ నూతన విధానాన్ని అప్పటి ప్రభుత్వం మొదలు పెట్టింది.
పరీక్షల కోసం సిద్ధం అయే విధ్యార్థులకు ఆర్థిక భారం వ్యయప్రయాసలు తగ్గించే దిశగా ఏపీపీఎస్సీ సమూల మార్పులపై దృష్టి పెట్టింది. దినిలో భాగంగానే ప్రిలిమ్స్/ స్క్రీనింగ్ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. దాని ద్వారా అభ్యర్థులకు మేలు జరగడం ఖాయమని కమీషన్ చెబుతోంది.