అమరావతి: సంక్రాంతి రద్దీకి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు: హైదరాబాద్ నుంచి ఏపీకి 2,400 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) కీలక చర్యలు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రయాణికుల సౌకర్యార్థం 2,400 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వెల్లడించింది.
ఈ ప్రత్యేక బస్సులు జనవరి 9 నుంచి జనవరి 13 వరకు అందుబాటులో ఉంటాయని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. రెగ్యులర్ బస్సులకు అదనంగా ఈ బస్సులు నడుస్తాయని, ఈ ప్రత్యేక సేవలపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించబోమని స్పష్టం చేశారు. రెగ్యులర్ ఛార్జీలకే ప్రయాణం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌లో రద్దీని తగ్గించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలిపారు. జనవరి 10 నుంచి జనవరి 12 వరకు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే అన్ని రెగ్యులర్, ప్రత్యేక బస్సులను ఎంజీబీఎస్‌కు ఎదురుగా ఉన్న పాత సీబీఎస్ గౌలిగూడ నుంచి నడపనున్నట్లు వివరించారు.
ప్రయాణికుల సమర్థవంతమైన రవాణా కోసం బస్సుల సమయాలపై పూర్తి వివరాలు ఏపీఎస్‌ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ లేదా ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు.