అమరావతి: ఏపీఎస్ ఆర్టీసీలో నూతన టికెటింగ్ విధానంపై కొత్త ప్రాజెక్టుకు రోడ్డు రవాణా, మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుండి ఆమోదం లభించింది. ఆర్టీసీ అధికారులు టెండర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కొత్త టెక్నాలజీతో టికెటింగ్, రిజర్వేషన్, ట్రాకింగ్, ఫిర్యాదులు, డేటా అంతా ఒకే యాప్‌లో రూపొందించేలా ‘యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్’ ప్రాజెక్టు త్వరలో ప్రారంభం అవనుంది.
దేశంలో ఏ రాష్ట్ర రవాణా శాఖ అమలు చేయని విధంగా ఈ ప్రాజెక్టును ఏపీఎస్‌ఆర్టీసీ చేపట్టనుంది. ఇప్పుడు టికెట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే వెబ్‌సైట్‌కు, ట్రాకింగ్, ఫిర్యాదులకు వేర్వేరు వెబ్‌సైట్‌లను ఆశ్రయించాలి. ఇకపై ఒకే యాప్‌లో అన్ని సేవలు లభ్యమయ్యేలా యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ విధానాన్ని అమలు చేస్తారు.
ఏపీఎస్ ఆర్టీసీ నుండి వచ్చిన డ్రాఫ్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ ఇప్పుడు ఆమోదముద్ర వేయడంతో ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్లు పిలిచి ఎంపికైన కన్సార్షియంకు ప్రాజెక్టును అప్పగిస్తారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.30 కోట్ల నిధుల్ని కూడా అందిస్తోంది.
పల్లె వెలుగు బస్సుల నుంచి హై ఎండ్ టెక్నాలజీ బస్సుల వరకు ఈ విధానం అమలవుతుంది. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లను కలిపి ఈ ప్రాజెక్టు అమలు చేస్తారు. క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ వినియోగించనున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 39 శాతం మాత్రమే ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ శాతం ఇంకా పెంచేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.