హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల జరిగిన ఎంసెట్ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. కాగా ఈ ఎంసెట్ లో టాప్ టెన్ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పలువురు తమ్మ సత్తా చాటారు. ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకుల్లో ఆరు ర్యాంకులు ఏపీ విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగింది.
అలాగే అగ్రికల్చర్ మరియు మెడికల్ విభాగంలో కూడా ఏపీకి చెందిన విద్యార్థులకు టాప్ టెన్‌లో నాలుగు స్థానాలు దక్కాయి. ఎంసెట్ ఫలితాలు ప్రకటించిన తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంజనీరింగ్ విభాగంలో 82.08 శాతం, అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 92.48 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు.
అయితే ఈ సారి విద్యార్థుల ఇంటర్మీడియట్ మార్కులను వెయిటేజ్ లో పరిగణించలేదు. ఇదివరకు ఉన్న ఇంటర్ సబ్జెక్టుల్లో కనీస మార్కుల అర్హత నిబంధనను తీసివేశారు. ఎస్సీ, ఎస్టీల విద్యార్థుల మినహా మిగతా అందరికీ కటాఫ్ మార్క్ లను 40గా నిర్ణయించారు.
ఈ సారి తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 1,64,963 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 1,47,991 మంది మాత్రమే పరీక్ష రాశారు. వీరిలో 1,21,480 మంది పరీక్షలో అర్హత సాధించారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 86,641 మంది దరఖాస్తు చేయగా, 79,009 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 73,070 మంది అర్హత సాధించారు.
ఇదిలా ఉండగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సత్తి కార్తికేయ అనే ఏపీ విద్యార్థి తెలంగాణ ఎంసెట్‌లో 158.497905 పర్సంటైల్ మార్కులతో ప్రథమ ర్యాంకర్‌గా నిలిచాడు. వ్యాపారి సత్తి త్రినాథరావు, కృష్ణకుమారి దంపతుల రెండో కుమారుడైన కార్తికేయ ఇప్పటికే 99.99 పర్సంటైల్‌తో ఆల్ ఇండియా ర్యాంక్‌లో ఉన్నాడు. ఆలిండియా ఒలింపియాడ్‌లో 5వ ర్యాంకు సాధించాడు. ఇంటర్నేషనల్ ఒలింపియాడ్‌లోనూ ఆ విద్యార్థి తన సత్తా చాటాడు.