భారతీయ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్న ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ వ్యక్తిగత జీవితంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 29 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత, ఆయన భార్య సైరా బాను విడాకులు కోరారు.
ఈ వార్త ఆయన అభిమానులను ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఈ జంట విడిపోవాలనే నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలపై స్పష్టంగా క్లారిటీ అయితే ఇవ్వలేదు.
సైరా బాను తరఫు న్యాయవాది వందనా షా ఒక ప్రకటన విడుదల చేస్తూ, ముఖ్యమైన భావోద్వేగ ఒత్తిళ్ల కారణంగా, సైరా తన వైవాహిక జీవితం నుంచి బయటపడాలని నిర్ణయించుకుందని తెలిపారు. సైరా తన వ్యక్తిగత జీవితంపై ప్రైవసీని గౌరవించాలని ప్రజలను కోరారు.
ఈ నిర్ణయం ఎమోషనల్ గా కఠినమైనదని సైరా బాను తెలిపినట్లు ఆమె లాయర్ పేర్కొన్నారు. ఈ వివాహం 1995లో పెద్దలు కుదిర్చినటువంటి వివాహం అని, ఏఆర్ రెహమాన్ తన తల్లి ఇష్ట ప్రకారం సైరాను పెళ్లి చేసుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని అభిమానులు గుర్తు చేసుకున్నారు.
ఇక ఏఆర్ రెహమాన్, సైరా బానుకు ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబం సుఖసంతోషాలతో ఉండేలా కనిపించినప్పటికీ, ఈ విడిపోవాలనే నిర్ణయం వీరి మధ్య ఉన్న సమస్యలను స్పష్టంగా తెలియజేస్తోంది.
గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న పలు సమస్యల కారణంగా, ఈ జంటకు తమ మధ్య ఉన్న బంధాన్ని కొనసాగించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.. అని వందనా షా వివరించారు. సైరా బాను ఈ సమయంలో ఫ్యామిలీ ప్రైవసీని గౌరవించాలని కోరుతూ, తన వ్యక్తిగత జీవనయానం గురించి అవగాహనతో స్పందించమని అభ్యర్థించారు.