జాతీయం: దేశ రాజకీయాలను శాసిస్తున్నది వారేనా?
ఇప్పుడు ఎన్నికలంటే.. పార్టీలు వర్సెస్ పార్టీలులా కనిపించడం లేదు. పొలిటికల్ కన్సల్టెన్సీలు వర్సెస్ పొలిటికల్ కన్సల్టెన్సీలులా నడుస్తోంది… ఫలితాలు ఎలా ఉంటాయన్నది పక్కన పెడితే దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్తల పాత్ర పెరుగుతున్నది వాస్తవం… ఇది మారుతున్న నేటి మోడరన్ రాజకీయానికి నిదర్శనమని పలువురు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల్లో ప్రజాభిప్రాయాన్ని మలచడంలోనూ, నాయకులకు పాజిటివ్ ఇమేజ్ తీసుకురావడంలోనూ వ్యూహకర్తల పాత్ర చాలానే ఉంటుంది. అదే సమయంలో వ్యూహకర్తల ద్వారానే క్షేత్రస్థాయిలో పరిస్థితులను మలచుకోవచ్చనే అభిప్రాయానికి రాజకీయ నాయకులు వస్తున్నారు… ఈ వింత పోకడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఒక ప్రధాన పార్టీకి ఘోర పరాభవం తెచ్చిపెట్టింది. రాజకీయాల్లో ప్రజలకు దూరంగా ఉండి కేవలం వ్యూహ్యాకర్తలను నమ్ముకుంటే అది నేల విడిచి సాము చేసినట్టు అవుతుందని ఆ పార్టీ అధినేతకు ఆలస్యంగా అర్ధం అయింది…
చాలామంది రాజకీయ నేతలు తమ పార్టీ కార్యకర్తలు, నేతలు కన్నా వ్యూహకర్తల బృందాల ఫీడ్ బ్యాక్ నే ఎక్కువగా నమ్ముతున్నాయి. రాజకీయాల్లో తమ శ్రేణుల అభిప్రాయాల ఆధారంగా నిర్ణయాలు ఉంటేనే శ్రేయస్కరం. కానీ ప్రజలతో నాయకుల సంబంధాలు అంతంతమాత్రంగా మారుతున్న వేళ కన్సల్టెన్సీలు దేశ రాజకీయాలను శాసిస్తున్నాయి.
వర్తమాన రాజకీయాల్లో తమ పార్టీ నాయకుడి కీర్తిని పెంచడమే కాకుండా, ప్రత్యర్థుల ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం కూడా ఎక్కువగా జరుగుతోంది. సోషల్ మీడియా క్యాంపెయిన్లలో ఇదే అసలు ముఖ్యభాగం.
దీనికోసం ఎన్నికల వ్యూహకర్తలు ప్రత్యేక బృందాలు నియమించుకుంటున్నారు. అయితే దేశ రాజకీయాలలో ఈ సోషల్ మీడియా క్యాంపైన్ ఒక వికృత క్రీడగా మారింది…
భారత రాజకీయాలను శాసిస్తున్న కొంతమంది రాజకీయ వ్యూహకర్తలు:
ప్రశాంత్ కిషోర్: ఇతని పేరు రాజకీయాలంటే అనుభవం వున్నా ఎవరికైనా సుపరిచితమే. భారత రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్లపాటు ఐక్యరాజ్యసమితిలో పనిచేశాడు. జనతాదళ్(యునైటెడ్) కు చెందిన ప్రశాంత్ కిషోర్‌ను పౌరసత్వ సవరణ చట్టం (2019) పై పార్టీ అధిపతి నితీష్ కుమార్ ని విమర్శించినందుకుగాను 2020 పార్టీ నుండి బహిష్కరించారు.
2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో 3వ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి సహాయం చేయడానికి కిషోర్ తన మొట్టమొదటి ప్రధాన రాజకీయ ప్రచారం చేసాడు. 2014 లోక్ సభ ఎన్నికలలో బిజెపి సంపూర్ణ మెజారిటీని సాధించడానికి కిషోర్‌కు చెందిన సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ (సిఎజి) అనే ఎన్నికల ప్రచారమే కీలక భాగం.
2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో JD(U)-RJD-కాంగ్రెస్ కూటమికి, 2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో, 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి, 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆప్‌కి, 2021లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరుపున, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మమతా పార్టీకి పనిచేసిన అనుభవం వుంది.
ఇండియా టుడే నివేదించిన ప్రకారం, రాజకీయ పార్టీలు లేదా నాయకులకు సలహా ఇచ్చినందుకు ఇతను రూ. 100 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాడని వినికిడి.
రాబిన్ శర్మ: ప్రశాంత్ కిషోర్ యొక్క ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (I-PAC)లో మాజీ డైరెక్టర్ అయిన రాబిన్ శర్మ, రాజకీయ సంప్రదింపులలో చెప్పుకోదగ్గ వ్యక్తిగా ఎదిగారు. I-PACలో తన నైపుణ్యాలను మెరుగుపరిచిన తర్వాత, అతను షోటైమ్ కన్సల్టెన్సీ (STC)ని స్థాపించాడు. 2019 ఎన్నికల ఓటమి తరువాత టీడీపీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావటంలో కీలకపాత్ర పోషించాడు. అలాగే మేఘాలయ, ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల పార్టీల గెలుపుకి కృషి చేశాడు…
సునీల్ కానుగోలు: కర్ణాటకలో మరియు తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ భారీ విజయం వెనుక సునీల్ కానుగోలు పేరు మారుమోగిపోయింది. సునీల్ కానుగోలు గతంలో ప్రశాంత్ కిషోర్ బృందంలో సభ్యుడు, 2014 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకి కీలకపాత్ర పోషించాడు, తరువాత ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ మరియు కర్ణాటకతో సహా అనేక రాష్ట్రాలలో బిజెపి విజయవంతమైన ఎన్నికల ప్రచారంలో కూడా కీలక పాత్ర పోషించాడు.
భారత్ జోడో యాత్రలో గణనీయమైన పాత్ర పోషించి రాహుల్ గాంధీకి సన్నిహిత సలహాదారుగా ప్రసిద్ధి చెందారు. ఎన్నికల వ్యూహకర్తగా కాంగ్రెస్‌లో చేరడానికి ముందు బీజేపీ, డీఎంకే, అన్నాడీఎంకేలకు పనిచేశారు.
ప్రస్తుతం కానుగోలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముఖ్య సలహాదారుగా పదోన్నతి పొందారు.
ఏదేమైనప్పటికీ గెలుపే లక్ష్యంగా పోటీలో దిగుతున్న కార్పోరేట్ రాజకీయాల్లో వ్యూహకర్తల పేరుతో ఎలాంటి ప్రచారానికైనా దిగిపోతున్న పరిస్థితి సమాజానికి శ్రేయస్కరం కాదు అని పలువురు అభిప్రాయపడుతున్నారు…