స్పోర్ట్స్ డెస్క్: అర్జున్ టెండూల్కర్ క్రికెట్ భవిష్యత్తు గురించి యువరాజ్ సింగ్ తండ్రి, కోచ్ యోగరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అర్జున్ బౌలింగ్ కన్నా బ్యాటింగ్ పై దృష్టి పెడితే క్రిస్ గేల్ 2.0 లా మారతాడు” అని ఆయన స్పష్టం చేశారు. సరైన మార్గనిర్దేశం, శిక్షణ ఉంటే అర్జున్ లోని సామర్థ్యం వెలుగులోకి వస్తుందని అభిప్రాయపడ్డారు.
“యువరాజ్ గనుక అతన్ని మూడు నెలలు ట్రెయిన్ చేస్తే అర్జున్ విధ్వంసకర బ్యాటర్ అవుతాడు. ఇది నా వ్యక్తిగత నమ్మకం” అని యోగరాజ్ అన్నారు. ఫాస్ట్ బౌలర్లలో ఒత్తిడి సంబంధిత గాయాల ముప్పు ఉన్నందున, బ్యాటింగ్ పై దృష్టి పెట్టడం మంచిదని సూచించారు.
గతంలో అర్జున్, యోగరాజ్ వద్ద 12 రోజులు శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత గోవా తరఫున తన రంజీ అరంగేట్రంలోనే సెంచరీ సాధించాడు. ఇదే తరహాలో 1988లో సచిన్ టెండూల్కర్ కూడా అరంగేట్రంలో శతకం బాదడం విశేషం.
“అతనిలో సత్తా ఉంది. ఒక సంవత్సరం నాకు అప్పగిస్తే అసలు ఫలితాలు చూపిస్తాను” అని యోగరాజ్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో అర్జున్ కెరీర్ పై మరోసారి చర్చ మొదలైంది. బ్యాటింగ్ దిశగా వెళ్లడం అతనికి మార్గాన్ని వేస్తుందా అనేది చూడాలి.