న్యూ ఢిల్లీ: భద్రతా కారణాలు, సెన్సిటివ్ డేటా లీకేజీ తదితర కారణాల దృష్ట్యా, భారత ఆర్మీ జవాన్లకు 89 రకాల యాప్స్ పై నిషేధం విధించింది. ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి యాప్ ల నుంచి వెంటనే తమ ఖాతాలని తొలగించాలని ఇండియన్ ఆర్మీ బుధవారం (జులై 8) నాడు జవాన్లకు ఆదేశాలు జారీ చేసింది. జులై 15 నాటికి జవాన్లందరు తమ ఖాతాల నుండి బయటకు రావాలని, ఈ ఆదేశాలు పాటించని సైనికులపై కఠిన చర్యలు తీసుకుంటామని తమ ప్రకటనలో హెచ్చరించింది .
ఈ 89 యాప్స్ లో ఇటీవల భారత ప్రభుత్వం నిషేధించిన 59 రకాల యాప్స్ కూడా వున్నాయి.
చైనా, పాకిస్తాన్ ఇంటలిజెన్స్ వర్గాల నుండి ఇతర దేశాల శత్రు సమాచారం తస్కరించటానికి ప్రయత్నాలు గతంలో చాలా జరిగాయి.ఈ నేపధ్యంలో గతేడాది నవంబర్ లో కేంద్ర ప్రభత్వం భారత్ ఆర్మీకి వాట్సాప్ కూడా వాడొద్దని ఆదేశించింది. కీలక సమాచారాన్ని ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోవద్దని కీలక ఆదేశాలు జారీ చేసింది.
దేశ సరిహద్దులో కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జవాన్లకు తమ మొబైల్ ఫోన్ల నుండి ఈ యాప్స్ ను వెంటనే తొలగించాలని ఆర్మీ ఆదేశించింది. గత మూడేళ్ళుగా పలు భారత సైనికాధికారులు, పాకిస్తాన్ ఇంటలిజెన్స్ వర్గాల హనీ ట్రాప్ వలలో చిక్కుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయి.శత్రు దేశాల నుండి ఇటువంటి ముప్పు నుంచి తప్పించుకోవడానికి భారత ప్రభుత్వం ఇప్పుడు సోషల్ మీడియా యాప్స్ వాడకం పై కూడా ఆంక్షలు విధించింది.
ఇదిలా ఉండగా భారత్, చైనాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు తూర్పు లద్దాఖ్‌లోని ఘర్షణాత్మక హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నుంచి వెనక్కు తీసుకునే ప్రక్రియ సోమవారం మొదలైంది. చైనా దళాలు తమ శిబిరాలను బుధవారం నాటికి పూర్తిగా తొలగించాయి.