అమరావతి: ఏపీలో 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం
2027లో జరగబోయే అఖండ గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు గోదావరి జిల్లాలో సమగ్ర ఏర్పాట్లను చేపట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. భక్తుల రద్దీకి, అవసరాలకు తగినట్లుగా పుష్కర ఘాట్లను అభివృద్ధి చేయడం, ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల విస్తరణ వంటి చర్యలు ప్రారంభించారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి దుర్గేష్‌తో పాటు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కలెక్టర్ పి. ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ కేతాన్ గార్గ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
8 కోట్ల మంది భక్తుల రాక:
2027లో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం సుమారు 8 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశముందని మంత్రి తెలిపారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని రద్దీ నియంత్రణ, భక్తుల సౌకర్యాలను పెంపొందించే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విజన్ 2047 తరహాలో రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఈ పుష్కరాలను గణనీయంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు.
కేంద్రం నుంచి నిధుల మంజూరు:
గోదావరి పుష్కరాలకు సంబంధించి కేంద్రం నుంచి నిధుల మంజూరుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న ఘాట్లను మరింత అభివృద్ధి చేయడమే కాకుండా కొత్త ఘాట్లను కూడా ఏర్పాటు చేయడానికి కేంద్రం నుంచి నిధుల వినియోగంపై చర్చలు జరిపినట్లు వివరించారు.
కోర్ ప్లాన్ సిద్ధం – భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి:
కలెక్టర్ పి. ప్రశాంతి గోదావరి పుష్కరాల కోసం కోర్ ప్లాన్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. భక్తులకు సౌకర్యంగా బఫర్ జోన్ ప్రతిపాదించడంతో పాటు “స్టే హోమ్” పేరుతో ప్రత్యేక విడిది ప్రణాళికను రూపొందించారు. ప్రజలతో మరింత సమీపంగా మమేకం అయ్యేందుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు 30 రోజులపాటు శిక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు.
పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు వైద్యం, సంరక్షణ:
పుష్కరాల సమయంలో భక్తులకు అత్యవసర వైద్య సదుపాయాలు ఉచితంగా అందించడం, భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగేలా ఏర్పాట్లు చేస్తామని అధికారులు వివరించారు. పుష్కరాలను కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించే లక్ష్యంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.