దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఈ రోజు ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ బౌలర్లు సత్తా చాటారు. హసన్ అలీ, షాహిన్ ఆఫ్రిది, నుమాన్ అలీలు తమ కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్ ను చేరుకున్నారు. హసన్ అలీ 6 స్థానాలు ఎగబాకి 14వ స్థానానికి చేరగా, షాహిన్ ఆఫ్రిది ఏకంగా 9 స్థానాలు ఎగబాకి 22వ స్థానంలోకి నుమాన్ అలీ 8 స్థానాలు ఎగబాకి 46వ స్థానంలోకి చేరారు.
పాకిస్తాన్ జింబాబ్వేతో జరిగిన టెస్టు సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేయడంలో ఈ ముగ్గురు బౌలర్లు కీలకపాత్ర పోషించారు. పైగా ఈ ముగ్గురు ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం విశేషం. జింబాబ్వేతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో హసన్ అలీ(5-27) ఐదు వికెట్లు తీశాడు, రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్రిది(5-52), నుమాన్ అలీ(5- 86)తో అదరగొట్టారు. ఒకే జట్టుకు చెందిన ముగ్గురు బౌలర్లు ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడం 28 ఏళ్ల తర్వాత ఇదే తొలి సారి.
కాగా ఈ ర్యాంకింగ్స్ లో భారత బౌలర్ల నుంచి రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడే టాప్‌టెన్‌లో స్థానాన్ని సంపాదించుకుణ్ణాడు. అశ్విన్ (850 పాయింట్లతో) రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు, కాగా బుమ్రా 11వ స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో పాట్ కమిన్స్(908 పాయింట్లు), నీల్ వాగ్నర్( 825 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు.
ఇదిలా ఉండగా బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ కు చెందిన కేన్ విలియమ్సన్ అగ్రస్థానంలో ఉండగా, టీమిండియా ఆటగాల్లలో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మలు వరుసగా ఐదు, ఆరు, ఆరు స్థానాల్లో కొనసాగుతున్నారు.