ముంబై: సీరం ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అయిన్ అదార్ పూనావాలా (39) ఒక అరుదైన ఘనతను అందుకున్నారు. కోవిడ్-19 మహమ్మారిపై చేసిన పోరాటానికి గాను సింగపూర్ ప్రముఖ దినపత్రిక ది స్ట్రెయిట్స్ టైమ్స్ అందించే “ఆసియన్స్ ఆఫ్ ది ఇయర్” అవార్డుకి ఆయన ఎంపికయ్యారు. ఆసియా ఖండంలో ఈ ఘనతను సాధించిన ఆరుగురిలో ఒకరిగా పూనావాలా నిలిచారు.
కరోనా మహమ్మారి పై చేసిన పోరులో వారి ధైర్యం, నిబద్ధత, క్రియేటివిటీకి జోహార్లు చెబుతున్నామంటూ సింగపూర్ డెయిలీ కితాబిచ్చింది. ఈ క్లిష్ట సమయంలో విశేష కృషితో ఆసియాతోపాటు ప్రపంచానికి ఆశాకిరణాలుగా నిలిచారని వ్యాఖ్యానించింది. మొత్తం ఈ అవార్డుకు ఆరుగురిని ఎంపిక చేసింది. కరోనావైరస్ మహమ్మారి అంతంకోసం సమిష్టిగా అంకితభావంతో పనిచేసిన వీరులుగా వీరిని “వైరస్ బస్టర్స్”గా అవార్డు ప్రశంసాపత్రంలో కీర్తించింది.
ఈ జాబితాలో పేర్కొన్న మరో ఐదుగురిలో చైనా పరిశోధకుడు కరోనా మహమ్మారి వైరస్ సార్స్-కోవి-2 తొలి పూర్తి జన్యువును గుర్తించినందుకు చాంగ్ యోంగ్జెన్, మహమ్మారి అంతానికి వ్యాక్సిన్ రూపకల్పనలో కృషి చేసినందుకుగాను చైనా మేజర్-జనరల్ చెన్ వీ, జపాన్‌కు చెందిన డాక్టర్ ర్యూచికు సింగపూర్ ప్రొఫెసర్ ఓయి ఇంగ్ ఎంగ్, దక్షిణ కొరియాకు చెందిన వ్యాపారవేత్త సియో జంగ్-జిన్ తదితరులు ఈ అవార్డుకు ఎంపికైన వారిలో ఉన్నారు.
నిబద్ధతతో తమకు తాము అంకితమైన కృషితో ఆసియాతోపాటు, ప్రపంచ ప్రజలకు ఆశలను చిగురింప చేశారని సింగపూర్ ప్రెస్ హోల్డింగ్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ వారెన్ ఫెర్నాండెజ్ ప్రశంసించారు. ఇంతకు ముందెన్నడూ లేని కృషితో వార్తల్లో నిలవడంతోపాటు, తద్వారా ఆసియా అభివృద్ధికి సహాయపడిన వ్యక్తులకు, బృందాలకు లేదా సంస్థలకు ప్రతీ ఏడాదీ ఈ అవార్డులను అందిస్తుంది.