ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లో హత్రాస్ జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్కూలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో, తాంత్రిక పూజలలో భాగంగా ఏడేళ్ల బాలుడిని నరబలి ఇచ్చిన ఘటన కలకలం రేపింది. హత్రాస్ జిల్లా రస్గావ్ గ్రామంలో ఉన్న డీఎల్ పబ్లిక్ స్కూల్‌లో ఈ అమానుష సంఘటన చోటుచేసుకుంది. స్కూలు డైరెక్టర్, అతని తండ్రితో పాటు ముగ్గురు టీచర్లు ఈ ఘోరానికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే..
బాధిత బాలుడు కృతార్థ కుష్వాహా, రెండో తరగతి చదువుతున్నాడు. వారం రోజుల క్రితం బాలుడు చనిపోయినట్లు స్కూలు యాజమాన్యం తండ్రి కృష్ణన్ కుష్వాహకు సమాచారం ఇచ్చింది. “మీ కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు” అని చెప్పి, అతడిని ఆసుపత్రికి తీసుకెళుతున్నట్లు తెలిపారు. స్కూలు డైరెక్టర్ తండ్రి దినేశ్ బాఘెల్, బాలుడి తండ్రి కృష్ణన్ కు మృతదేహాన్ని తన కారులో అప్పగించాడు.
కృష్ణన్ తన కొడుకు మరణంపై అనుమానం రావడంతో, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో, పోలీసుల ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇచ్చిన దినేశ్‌ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. అతడు బాలుడిని స్కూలు అభివృద్ధి కోసం తాంత్రిక పూజల్లో భాగంగా బలి ఇచ్చినట్లు అంగీకరించాడు. హాస్టల్ నుంచి బయటకు తీసుకెళుతున్నప్పుడు బాలుడు కేకలు వేయడంతో, అతడిని కారులోనే గొంతు నులిమి చంపేశామని వివరించాడు.
మరో విఫల యత్నం:
ఈ ఘటనకు ముందు కూడా వారు మరో విద్యార్థిని బలి ఇచ్చేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కానీ ఆ ప్రయత్నం అదృష్టవశాత్తు విఫలమైంది.
అరెస్టులు:
ఈ దారుణ ఘటనలో స్కూలు డైరెక్టర్, అతని తండ్రి దినేశ్ బాఘెల్‌తో పాటు ముగ్గురు టీచర్లను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ ఘటన యావత్ దేశంలో తీవ్ర చర్చకు దారితీసింది.