లగచర్లలో అధికారులపై దాడి కేసులో మాజీ భారాస ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో అధికారులపై జరిగిన దాడి కేసు రాజకీయంగానూ కీలక మలుపు తీసుకుంది. ఈ దాడికి మాజీ ఎమ్మెల్యే, భారాస నాయకుడు పట్నం నరేందర్‌రెడ్డి ప్రధాన సూత్రధారిగా ఉన్నారని పోలీసులు ఆరోపించారు. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసం వద్ద ఆయనను అరెస్టు చేసి, పరిగి సీఐ కార్యాలయంలోని క్యాంప్‌కు తరలించారు.
అక్కడ హైదరాబాద్ మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1:40 వరకు విచారణ జరిగింది. విచారణ అనంతరం నరేందర్‌రెడ్డితోపాటు బోగిమోని మహేష్, బేగరి విశాల్, నీరేటి సాయిలు, నీరేటి రమేష్‌లను కూడా అరెస్టు చేశారు. వీరందరికీ కొడంగల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం నరేందర్‌రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.
రిమాండ్ నివేదిక ప్రకారం, నరేందర్‌రెడ్డి ప్రభుత్వంపై అస్థిరత సృష్టించాలనే లక్ష్యంతో ఈ కుట్రకు వ్యూహరచన చేశారని, తన అనుచరుడు బోగమోని సురేశ్ సహకారంతో ఇతర నిందితులను రెచ్చగొట్టారని పేర్కొన్నారు. నరేందర్‌రెడ్డి, సురేశ్‌ల మధ్య సెప్టెంబరు 1 నుండి దాడి జరిగిన రోజు వరకు మొత్తం 84సార్లు ఫోన్ సంభాషణలు జరిపారని, ఈ వివరాలను కాల్‌డేటా రికార్డర్(సీడీఆర్) ఆధారంగా పోలీసులు విశ్లేషిస్తున్నారు. దాడి రోజు ఒక్కసారి మాత్రమే సంభాషణ జరిగినట్లు గుర్తించారు.
కేసులో నరేందర్‌రెడ్డి కీలక పాత్రలో ఉన్నట్లు, ఈ కుట్రకు అవసరమైన ఆర్థికవనరులు, నైతిక మద్దతు కూడా ఆయన సమకూర్చినట్లు రిమాండ్ నివేదిక పేర్కొంది. భూసేకరణ కోసం అధికారులు సర్వే చేయడానికి వచ్చినప్పుడు, గ్రామస్థులను రెచ్చగొట్టి, అధికారులపై దాడి చేసేలా పురిగొల్పినట్లు నివేదిక వివరించింది. సురేశ్ గ్రామస్థులకు పార్టీ అగ్రనేతల మద్దతు ఉన్నట్లు నూరిపోశారని నివేదికలో పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యవాద భారతంలో అధికారులపై ఈ విధమైన దాడులు తీవ్ర ఆందోళన కలిగించాయని పోలీసులు తమ రిపోర్టులో అభిప్రాయపడ్డారు.