సిడ్నీ: ఆసీస్‌తో రెండో వన్డేలోనూ భారత్ పరాజయం చెందడంతో టీమిండియా వన్డే సిరీస్‌ను కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి వన్డేలో గెలిచిన ఆసీస్, రెండో వన్డేలో కూడా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ భారత్ పై 51 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే 2-0 తేడాతో సొంతం చేసుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ కేవలం నాలుగు వికెట్ల నష్టానికి 389 పరుగులు చేసింది. వార్నర్(83; 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫించ్(60; 69 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ ), స్టీవ్ స్మిత్(104; 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), లబూషేన్(70; 61 బంతుల్లో 5 ఫోర్లు), మ్యాక్స్‌వెల్( 63; 29 బంతుల్లో 4 ఫోర్లు, 4సిక్సర్లు)లు రాణించడంతో ఆసీస్ రికార్డు స్థాయిలో భారీ స్కోరు చేసింది.
మళ్ళీ టాస్ గెలివడంతో బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు శుభారంభం లభించింది. ఆసీస్ ఇన్నింగ్స్‌ను వార్నర్-ఫించ్‌లు దూకుడుగా ఆరంభించారు. ఈ జోడి తొలి వికెట్‌కు 142 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించడంతో ఆసీస్‌కు అడ్డులేకుండా పోయింది. తరువాత వచ్చిన బ్యాట్స్‌మన్ ఫ్రీగా బ్యాటింగ్ చేసి పరుగులు వరద పారించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 338 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. టీమిండియా తమ పోరాటాన్ని కడవరకూ సాగించిన భారీ లక్ష్యం కావడంతో ఓటమి తప్పలేదు. టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్(30; 23 బంతుల్లో 5 ఫోర్లు), మయాంక్ అగర్వాల్(28; 26 బంతుల్లో 4 ఫోర్లు)లు 9 ఓవర్లలోపే ఔటయ్యారు. ఆ తరుణంలో విరాట్ కోహ్లి(89 ; 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్(38; 36 బంతుల్లో 5 ఫోర్లు)లు మరమ్మత్తులు చేశారు.
అనంతరం కోహ్లి-కేఎల్ రాహుల్‌లు ధాటిగా బ్యాటింగ్ చేశారు. ప్రధానంగా రాహుల్ ఫోర్లు, సిక్స్‌లతో ఆకట్టుకున్నాడు. కాగా, ఈ జంటం 72 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. హజిల్‌వుడ్ బౌలింగ్‌లో హెన్రిక్యూస్ ఒక మెరుపు క్యాచ్ అందుకోవడంతో కోహ్లి పెవిలియన్ చేరాడు.
ఆపై హార్దిక్ పాండ్యాతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ 63 పరుగులు జోడించిన తర్వాత రాహుల్(76; 66 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఐదో వికెట్‌గా ఔటైన తర్వాత టీమిండియా స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోయింది. జడేజా(24; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా(28; 31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)లు మోస్తరుగా ఆడారు. నిర్ణీత ఓవర్లలో భారత్ 9 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసి ఓటమి పాలైంది.